: బతుకమ్మ సందర్భంగా కోటి మంది మహిళలకు చీరలు.. తెలంగాణ ప్రభుత్వ కానుక!
తెలంగాణ పండుగ బతుకమ్మ సందర్భంగా కోటికి పైగా చీరలను తెలంగాణ మహిళలకు బహుమానంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ జీవితం, సంస్కృతిలో భాగమై, కుటుంబ విలువలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంతోషాలను రెట్టింపు చేసేందుకు మహిళలకు చీరలు బహూకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ చీరలను సెప్టెంబర్ 18-20 తేదీల మధ్య రేషన్ షాపుల ద్వారా కుల, మతాలకు అతీతంగా 1,04,57,610 మంది మహిళలకు పంచి పెట్టనున్నారు. ఇందుకోసం ఆర్థికంగా కష్టాలు పడుతున్న చేనేత కార్మికుల నుంచి చీరలు కొనుగోలు చేశామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీరల నాణ్యతను కేసీఆర్ పరీక్షించి, పంచడానికి ఆమోదం తెలిపారు. రంజాన్, క్రిస్మస్ పండుగల సమయంలో తమ ప్రభుత్వం ఆయా మతాల వారికి వస్త్రాలు బహూకరించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.