: భారత్ కు వెళ్తే మీ ప్రాణాలకు ముప్పే.. మూల్యం చెల్లించుకుంటారు: తన పౌరులను హెచ్చరించిన ఆస్ట్రేలియా
తనను తాను దేవుడిగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ రాం రహీమ్ ను అత్యాచారం కేసులో దోషిగా తేల్చుతూ సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించిన నేపథ్యంలో, ఉత్తరాదిన శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఆయన భక్తులు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ ఘర్షణల నేపథ్యంలో, దాదాపు 30 మంది మృత్యువాత పడ్డారని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
ఈ ఘటనల నేపథ్యంలో, తన పౌరులకు ఆస్ట్రేలియా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు వెళ్లడం క్షేమకరం కాదని... అక్కడకు వెళ్లే వారి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని హెచ్చరించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలను జారీ చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్ప, ఇప్పట్లో భారత్ కు వెళ్లరాదని సూచించింది. తమ మాటను పెడచెవిన పెట్టి భారత్ కు వెళ్లేవారు... తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు తలెత్తవచ్చని స్పష్టం చేసింది.