: రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షను ఖరారు చేయనున్న కోర్టు!
ఇద్దరు సాధ్వీలపై రేప్ కేసులో దోషిగా తేలిన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు ఈ నెల 28న పంచ్‌కుల సీబీఐ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు శిక్షను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనపై నమోదైన అభియోగాల ప్రకారం తక్కువలో తక్కువగా ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జీవిత ఖైదు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. కాగా, గుర్మీత్‌పై తీర్పు వెలువడిన తర్వాత జరిగిన హింసలో ఇప్పటి వరకు 30 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. 250 మందికి పైగా గాయపడ్డారు. గుర్మీత్ అనుచరులు పంజాబ్, హరియాణాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.