: ధోని సలహాతోనే అర్ధ శతకం సాధ్యమైంది: క్రికెటర్ భువనేశ్వర్
ఒత్తిడిని అధిగమించడంలో ధోనీ సలహా పాటించడం వల్లే తాను అర్ధ శతకం పూర్తిచేయగలిగానని శ్రీలంకతో రెండో వన్డేలో రాణించిన భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ఆడేటపుడు ఆందోళన చెందకుండా టెస్ట్ మ్యాచ్ ఆడినట్లుగా ఆడాలని ధోని తనకు సలహా ఇచ్చినట్లు భువీ చెప్పాడు. రెండో వన్డేలో ఓటమి అంచుల వరకూ వెళ్లిన భారత్‌ను గెలిపించడంలో భువీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో 27 ఏళ్ల భువనేశ్వర్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు విజయం అందించాడు. ‘ఓపెనర్లు బాగా ఆడటంతో అలవోకగా విజయం సాధిస్తామని అనుకున్నా. తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో కొంత ఆందోళనకు గురయ్యా. అలాంటి సమయంలో బ్యాటింగ్‌కు దిగిన నేను గెలుపులో కీలకపాత్ర పోషిస్తానని ఊహించలేదు. ధోనీ నా దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమన్నాడు’ అని భువీ వివరించాడు. కెరీర్లో భువనేశ్వర్కిది తొలి అర్ధశతకం. మూడో వన్డే ఆగస్టు 27న కాండీలో జరగనుంది.