: హరిబాబుకు కేంద్రమంత్రి పదవి.. ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆకుల, సోము, కన్నా!


ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వారం బీజేపీ చీఫ్ అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ హరిబాబు కనుక కేంద్రానికి వెళితే ఆయన స్థానాన్ని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ  సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలలో ఒకరితో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, విశాఖపట్టణానికి రైల్వే జోన్ ప్రకటించే అవకాశం లేకపోవడంతో, విశాఖ లోక్ సభ సభ్యుడు హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా స్థానిక ప్రజలను శాంతింపజేయాలని మోదీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హరిబాబు కనుక కేంద్రానికి వెళితే ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై షా తన పర్యటన సందర్భంగా విజయవాడలో పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో చర్చించనున్నారు.  

అయితే అధ్యక్షుడి రేసులో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకే ఎక్కువ చాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలపై గట్టి పట్టున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరు కూడా చక్కర్లు కొడుతోంది. అయితే టీడీపీతో ఆయనకున్న విభేదాలు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి పేరు వినిపించినా ఆమెకు అంత సీన్ లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండడం, టీడీపీతో విభేదాల వల్ల ఆమె పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News