: గుర్మీత్‌పై నేడు కోర్టు కీలక తీర్పు.. రెండు రాష్ట్రాల్లో హై అలెర్ట్.. సంయమనం పాటించాలని రాక్‌స్టార్ బాబా ట్వీట్!
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్ స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్ రామ్ రహీంసింగ్పై నమోదైన అత్యాచారం కేసులో నేడు కీలక తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పారా మిలటరీ బలగాలను మోహరించారు. గుర్మీత్‌కు మద్దతుగా వేలాదిమంది భక్తులు పంచకుల చేరుకుంటున్నారు. కాగా, వెన్ను నొప్పి తనను బాధిస్తున్నా కోర్టుకు హాజరవుతున్నట్టు గుర్మీత్ ట్వీట్ చేశారు. అందరూ సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని అనుచరులకు పిలుపునిచ్చారు.
2002లో గుర్మీత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. తమపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఇద్దరు మహిళా సాధ్వీలు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కాగా, తీర్పు నేపథ్యంలో పంచకుల జిల్లా కోర్టుకు వెళ్లే మార్గాలపై పోలీసులు నిఘా పెంచారు.