: కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ పాత్రలో టబూ!


బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు సంబంధించిన జీవిత చరిత్రలతో పలు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కబోతోంది. భారతీయ మహిళ ఉజ్మా అహ్మద్ కథే ఇది. పాకిస్థాన్ వ్యక్తి తాహిర్ అలీ ఆమెను తుపాకీతో బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, తిరిగి ఇండియాకు రావడానికి ఆమె ఎంతో ప్రయత్నించింది. చివరకు భారత విదేశాంగశాఖ మంత్రి సుస్మాస్వరాజ్ జోక్యంతో ఆమె భారత్ కు చేరుకుంది. భారత్ చట్టపరంగా చేసిన పోరాటం ఫలించి ఉజ్మా గత మే 25న స్వదేశానికి తిరిగి వచ్చింది.

ఉజ్మా జీవిత కథనే దర్శకుడు ధీరజ్ కుమార్ ఇప్పుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సుష్మాస్వరాజ్ పాత్రను సీనియర్ నటి టబూ పోషించబోతోంది. ఉజ్మా క్యారెక్టర్ ను పరిణీతి చోప్రా పోషించనున్నట్టు సమాచారం. ఇండియన్ డిప్యూటీ హైకమిషన్ గా అనిల్ కపూర్ కనిపించబోతున్నట్టు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు ధీరజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని... ఇప్పటికే ఉజ్మాను తాను రెండు సార్లు కలుసుకున్నానని చెప్పాడు. ఉజ్మా కథ విని తాను చలించిపోయానని... ఆమెతో భేటీ అయిన సందర్భంగా శారీరకంగా, భౌతికంగా ఆమె అనుభవించిన నరకయాతన గురించి ఆమె పూర్తిగా వివరించారని తెలిపాడు. స్వేచ్ఛ కోసం ఆమె పడిన తపన, ప్రభుత్వం యొక్క బాధ్యతల పైనే ఈ సినిమాలో తాను ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నానని చెప్పాడు. నవంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని... వచ్చే ఏడాది మేలో విడుదల చేస్తామని తెలిపాడు.

  • Loading...

More Telugu News