: చెక్కులు జారీ చేస్తున్నారా?... ఒకసారి సంతకం చూసుకోండి... ఇప్పుడు అదే పెద్ద సమస్య
ఖాతాదారుడి దరఖాస్తులోని సంతకం, చెక్కుమీద పెట్టిన సంతకం సరిపోలని కారణంగా 10 శాతం చెక్కులు చెల్లకుండా పోతున్నాయని ఓ నివేదికలో తేలింది. నాగరిక జీవనంలో భాగంగా ప్రతి ఒక్కటి యాంత్రికంగా మారడంతో చేతిరాత అవసరం లేకుండా పోయింది. దీంతో చాలా మంది చేతిరాత ప్రతి రెండేళ్లకోసారి మారిపోతోంది. ఈ కారణంగా బ్యాంకులో ఖాతా తెరిచిన సమయంలో పెట్టిన సంతకం, ఇప్పటి సంతకం సరిపోలడం లేదు. ఈ సంతకాల మధ్య చిన్న గీత తేడా ఉన్నా బ్యాంకులు చెక్కులను తిరస్కరిస్తున్నాయి.
అంతేకాకుండా చెక్కులు తిరస్కరణకు గురైన కారణంగా జారీ చేసిన వారికి, తీసుకున్న వారికి రూ. 150 నుంచి రూ. 300 వరకు జరిమానా విధిస్తున్నాయి. అలాగే నగదు నిల్వలు లేకపోవడం, తేదీల్లో పొరపాట్లు, చేతిరాతలు దిద్దటం వంటి కారణాలతో కూడా 40 శాతానికి పైగా చెక్కులు చెల్లుబాటు కావడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. సీటీఎస్ విధానం వచ్చాక ఆన్‌లైన్‌లో చెక్కుల మారకం జరుగుతోంది. అందుకే చెక్కుల క్లియరెన్స్‌లో సంతకం కీలకంగా మారింది. అలాగే తెరచిన ఖాతాను మూసివేయడంలో కూడా సంతకం కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి చెక్కులు జారీ చేసేముందు ఒకసారి సంతకాన్ని సరి చూసుకోండి. మీ సంతకంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు వెళ్లి పాత సంతకాన్ని, కొత్త సంతకంలోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.