: తమిళుల అభిమానం..హీరో అజిత్ ఆకృతిలో 57 కిలోల ఇడ్లీ!
హీరో అజిత్ నటించిన చిత్రం ‘వివేకం’ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అజిత్ అభిమానులు వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అజిత్ ఆకృతిలో 57 కిలోల బరువు ఉన్న పెద్ద ఇడ్లీని తయారు చేశారు. ఈ ఇడ్లీని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
ఈ సందర్భంగా తమిళనాడు సమైయల్ కలై తాలజాలర్ మున్నేట్ర సంఘం కార్యదర్శి ఇనియావన్ మీడియాతో మాట్లాడుతూ, ‘వివేకం’ అజిత్ 57వ సినిమా అని, అందుకే, 57 కిలోల బరువైన ఇడ్లీని తయారు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది వీర చెన్నై అజిత్ ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పారు. మదర్ థెరిస్సా, జవహర్ లాల్ నెహ్రూ, కామరాజ్, భారతీయార్ ల ఆకృతిలో ఇడ్లీలను గతంలో తయారు చేశామని, తాజాగా, అజిత్ ఆకృతిలో ఈ ఇడ్లీని తయారు చేసినట్టు చెప్పారు.