: పళనిస్వామి స్థానంలో సెంగోట్టయాన్ను సీఎం చేయండి.. ప్రభుత్వాన్ని కూల్చబోం: దినకరన్
తమిళనాడు సీఎం పళనిస్వామితో పన్నీర్ సెల్వం ఇటీవలే చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తామని కూడా ప్రకటించారు. అన్నాడీఎంకేలోని 19 మంది ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకున్న దినకరన్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరపేలా చేయాలని ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆ 19 మంది ఎమ్మెల్యేలు తమకు పళనిస్వామి ప్రభుత్వంపై విశ్వాసం లేదని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశారు. కాగా, తాజాగా దినకరన్ అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఓ ఆఫర్ ఇచ్చారు.
పళనిస్వామి స్థానంలో సెంగోట్టయాన్ను ముఖ్యమంత్రిని చేయాలని దినకరన్ ప్రతిపాదించారు. అలా చేస్తే తాము అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే కొనసాగుతామని, ప్రభుత్వాన్ని పడగొట్టబోమని పేర్కొన్నారు. మరోవైపు తమకు మద్దతు తెలపాలని ఈపీఎస్ వర్గం ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరపుతోంది.