: భారత్ లో అడుగుపెట్టిన నేపాల్ ప్రధాని.. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన పర్యటనను నిశితంగా గమనిస్తున్న చైనా!
నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేబా భారత్ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాదర స్వాగతం పలికారు. భారత్ లో ఐదు రోజులు పర్యటించనున్న షేర్ బహదూర్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చలు జరుపుతారు. తన పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి మోదీతో కూడా భేటీ అవుతారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి భారత పర్యటనకు వచ్చారు.
భారత్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై షేర్ బహదూర్ దేబా ప్రధానంగా చర్చించనున్నారు. అయితే, ఆయన పర్యటనను చైనా నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం భూటాన్-భారత్, చైనాల సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం విషయంలో తాము తటస్థంగా ఉంటామని నేపాల్ ఉప ప్రధాని కృష్ణ బహదూర్ మహరా ఇప్పటికే ప్రకటించారు. చైనా, భారత్‌ల మధ్య శాంతియుత చర్చలు జరగాలని అన్నారు. మరోవైపు నేపాల్-భారత్-చైనాల సరిహద్దు ప్రాంతమైన లిప్యులెఖ్ ప్రాంతంపై కూడా భారత్, నేపాల్ మధ్య విభేదాలు ఉన్నాయి.
ఆ ప్రాంతంపై 2015లో చైనా, భారత్‌కు మధ్య జరిగిన ఒప్పందంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. మరోవైపు భారత్, చైనా మధ్య డోక్లాంలో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో నేపాల్ ప్రధాని భారత్‌లో పర్యటిస్తుండడం పట్ల చైనా దృష్టి పెట్టింది.