: ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఆధార్ తప్పనిసరి... ఆదేశాలు జారీ చేసిన ఎన్ఐఓఎస్
ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఒకరికి బదులుగా మరొకరు హాజరయ్యే అవకాశం లేకుండా ఉండేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి చేస్తూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎన్ఐఓఎస్) ఆదేశాలు జారీ చేసింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత వచ్చే పరీక్షల నుంచి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆధార్ తప్పనిసరి చేసినట్లు ఎన్ఐఓఎస్ అధికారి తెలిపారు.
గత మార్చిలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడాన్ని పర్యవేక్షకులు గుర్తించినట్లు, అలాంటి అవకతవకలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. పరీక్ష కేంద్రాల్లో వేలిముద్ర మెషీన్లు ఉంటాయని, పరీక్షకు హాజరైన వారి వేలిముద్రలు, తమ ఆధార్ వేలిముద్రల డేటాబేస్‌తో సరిపోలితేనే లోపలికి అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈసారి పరీక్షలకు సీసీ కెమెరా సౌకర్యాలు ఉన్న పాఠశాలలను మాత్రమే పరీక్షా కేంద్రాలుగా ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు.