: అధ్యక్ష పదవికి ట్రంప్ రాజీనామా తప్పదు: విశ్లేషకుడి జోస్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018 నాటికి పదవికి రాజీనామా చేస్తారని ఘోస్ట్ రైటర్, పొలిటికల్ రిస్క్ విశ్లేషకుడు జాన్ రెన్స్ అభిప్రాయపడ్డారు. 2018లో అమెరికాలో అద్భుతం జరగబోతోందని, ట్రంప్ పదవికి రాజీనామా చేస్తారని, మళ్లీ డెమొక్రాట్లు అధికారంలోకి వస్తారని ఆయన అన్నారు. అమెరికాలో పన్నుల భారం రోజురోజుకూ పెరిగిపోవడమే దీనికి కారణమని తెలిపారు. ఇది ట్రంప్ కు పదవీ గండంగా మారుతుందని అన్నారు. పన్నుల రిటర్న్స్ పేరుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ట్రంప్ చర్యలను రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారని, సొంత పార్టీ నుంచే వస్తున్న వ్యతిరేకత ట్రంప్ ను పదవీచ్యుతుడిని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడం భారీ తప్పిదమని జాన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ కి పాలనపై అవగాహన లేదని, దీంతోనే అతను ప్రస్తుతం మేనేజ్ చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఆయన అన్ని విషయాల్లో విఫలం కావడానికి కారణం, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వకపోవడమేనని తెలిపారు. ట్రంప్ పాలనపై ప్రజలు కూడా విసిగిపోయారని చెప్పారు. టోనీ స్కాడ్జ్ అనే ఘోస్ట్ రైటర్ కూడా జాన్ రెన్స్ అభిప్రాయంతో ఏకీభవించారు. వీరికి అమెరికాలో మంచి పేరుంది. సరిగ్గా పరిస్థితులు, రాజకీయాలను అంచనా వేస్తారనే పేరుంది. దీంతో ట్రంప్ అధికారం 2017 తరువాత ఉండదని పేర్కొనడం పట్ల ఆసక్తి రేగుతోంది.