: ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే వడ్డించేస్తున్న ఇందిరా క్యాంటీన్లు.. కర్ణాటక కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!
ఇందిరా క్యాంటీన్లతో ప్రజల మనసులు దోచుకోవాలని భావించిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 101 ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించింది. పేదల ఆకలి తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ క్యాంటీన్లకు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని తెలుస్తోంది. ఆహార వ్యాపారం సహా ఆహారాన్ని అందించే ప్రైవేటు సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ తప్పనిసరి. ఈ లైసెన్స్ లేకుండానే కర్ణాటక ప్రభుత్వం ఇందిరా క్యాంటీన్లను నిర్వహిస్తున్న విషయం వెలుగు చూసింది.
అయితే త్వరలోనే ఈ లైసెన్స్‌ను తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రాజెక్టులకు లైసెన్స్ అవసరం లేదని మరికొందరు అధికారులు పేర్కొన్నారు. ప్రైవేటు హోటళ్లకు మాత్రమే ఈ లైసెన్స్ అవసరమన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు హోటళ్లు, ఈ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వమే లైసెన్స్ మంజూరు చేస్తుందని పేర్కొంటున్న అధికారులు ప్రభుత్వమే ఆ పనిచేస్తున్నప్పుడు దానికి లైసెన్స్‌తో పని ఉండదని వివరించారు.