: శబరిమల వెళ్లిన గాయకుడు ఏసుదాసు దంపతులు!
కేరళలోని పుణ్యక్షేత్రం శబరిమలను ప్రముఖ గాయకుడు ఏసుదాసు, ఆయన సతీమణి ప్రభ సందర్శించారు. నిన్న అయ్యప్పస్వామిని దర్శించుకున్న ఏసుదాసు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి నేతితో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఏసుదాసు మాట్లాడుతూ, అయ్యప్పస్వామిని దర్శించుకున్న తనకు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేనని, భక్తులందరినీ సమానంగా చూసే ఏకైక పుణ్యక్షేత్రం శబరిమల అని అన్నారు.
శబరిమల దర్శనానికి వచ్చే వారిని స్వామి, అయ్యప్ప, మణికంఠ, మలికపురం అని సంభోదిస్తారని ఆయన అన్నారు. కాగా, అయ్యప్పస్వామి దర్శనార్థం దాదాపు ప్రతి ఏడాది అక్కడికి వెళ్లే ఏసుదాసు, ఈసారి తన సతీమణి ప్రభను కూడా వెంట తీసుకెళ్లడం గమనార్హం. నిన్న ఆలయం మూసివేసే సమయంలో ‘హరివరాసనం’ అనే పాటను ఆయన పాడటంతో, భక్తులు పరవశించిపోయారు.