: షాకింగ్... తనకంటే ముందు నడిచిందని భార్యకు విడాకులు.. సౌదీలో చిన్న చిన్న విషయాలకే విడాకులిస్తున్న వైనం!
తనకంటే వేగంగా నడిచిందన్న కారణంతో భార్యకు భర్త విడాకులిచ్చేసిన షాకింగ్ సంఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... 'నా కంటే ముందు నడవ వద్దని, నన్ను అనుసరించాలని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి?..భార్య భర్తకు విధేయురాలై ఉండాలని ఖురాన్ చెబుతోంది కదా... దాని ప్రకారం నడవడం లేదేం?' అంటూ ఆరోపిస్తూ ఒక భర్త భార్యకు విడాకులు ఇచ్చేశాడని గల్ఫ్ న్యూస్ తెలిపింది. సౌదీ అరేబియాలో మహిళలపై జరుగుతున్న వివక్షను చూపే ఘటనలపై ఒక అధికారి మాట్లాడుతూ, చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు ఇచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వ్యక్తి తన స్నేహితులకు ఏర్పాటు చేసిన విందులో పద్ధతి ప్రకారం మేకతలను ముందుగా టేబుల్ వద్ద ఉంచనందుకు భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసి, విడాకులు ఇచ్చేశాడు. మరొక వ్యక్తి తన భార్య తనకు ఇష్టం లేని విధంగా కాళ్లకు కడియాలు (పట్టీల తరహాలోవి) వేసుకుందని హనీమూన్ సమయంలోనే విడాకులు ఇచ్చేశాడు. ఇలాంటి విడాకులు చూసి అందరూ షాక్ తింటున్నారు. అయితే సౌదీలో విడాకులు కావాలంటే మనలా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, భార్యతో మూడు సార్లు (ట్రిపుల్) తలాక్ చెబితే సరిపోయే విధానం కూడా ఈ విడాకులకు కారణంగా భావిస్తున్నారు.