: ఎన్నిక ముగిసే వరకు పోలింగ్ సర్వేలు ప్రకటించకూడదు.. ఓటు ఎవరికి వేశారో చెబితే కూడా చర్యలు!: భన్వర్ లాల్
నంద్యాలలో ఉప ఎన్నిక ప్రచార సమయం ముగిసిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ మీడియా సమావేశం నిర్వహించారు. నంద్యాలలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి పోలింగ్ నిర్వహిస్తున్నామని, ఎన్నిక ముగిసే వరకు టీవీల్లో లేదా పత్రికల్లో పోలింగ్ సర్వే వంటివి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటల సమయంలో లైనులో ఉన్నవారందరూ ఓట్లు వేయవచ్చని, ఆరు దాటాక పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం ఉండదని చెప్పారు.
నంద్యాలలో మొత్తం 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భన్వర్ లాల్ తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తే చర్యలు తప్పవని చెప్పారు. 15 వేల పైచిలుకు ఓటర్లకు ఇంకా ఓటరు స్లిప్పులు అందలేదని, త్వరలోనే అందుతాయని తెలిపారు. పోలింగ్ ముగిసేవరకు మద్యం దుకాణాల మూసివేత ఆంక్షలు ఉంటాయని చెప్పారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎవరయినా తాము ఎవరికి ఓటు వేశారో చెబితే కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయ పార్టీలు బల్క్ ఎస్ఎమ్ఎస్ లు పంపించకూడదని చెప్పారు.