: ఒకే ఒక్కడు కొండను తవ్వి.. రహదారి నిర్మించుకున్న వైనం!
ఒకే ఒక్కమనిషి కొండను తవ్వాడు.. వాహనాలు వెళ్లడానికి వీలుగా రహదారి నిర్మించాడు... అతడికి అందరిలా అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నాయా అంటే అది కూడా లేదు. అతడి కుడిచేయి, కుడికాలు సరిగ్గా పనిచేయవు. ఆయన జీవిత కథకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. తాజాగా ఆయనకు నెటిజన్లు మూడు చక్రాల వాహనం కొనిచ్చారు. కేరళకు చెందిన మెలితువీట్టిల్ శశి అనే వ్యక్తి 18 ఏళ్ల క్రితం ఎంతో హుషారుగా పనులు చేసుకునేవాడు. ఓ రోజు కొబ్బరి కాయలు కోయడం కోసం చెట్టు ఎక్కి కిందపడిపోయాడు. అనంతరం సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయాడు. శరీరంలోని కుడివైపు పాక్షిక పక్షవాతం వచ్చి, కుడిచేయి, కుడికాలు సరిగ్గా పనిచేయడం మానేశాయి. అసలే పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి ప్రతిరోజు తమ ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే తిరువనంతపురం వెళ్లి లాటరీ టికెట్లు అమ్మి పనిచేసుకోవాలనుకున్నాడు.
తాను ఆ ప్రాంతానికి వెళ్లడానికి మూడు చక్రాల వాహనం అవసరం పడింది. దాన్ని కొనేందుకు తన దగ్గర డబ్బులేకపోవడంతో గ్రామ పంచాయతీ అధికారులను ఆశ్రయించి, సాయం చేయమన్నాడు. శశిని చూసిన అధికారులు హేళనగా మాట్లాడారు. ఆయన ఇంటి ముందు ఓ కొండ ఉందని, ఒకవేళ వాహనం ఇచ్చినా ఎలా నడిపిస్తావని ప్రశ్నించి ఆయనను పంపించేశారు. అనంతరం కొన్ని రోజులకు మళ్లీ అధికారుల వద్దకు వచ్చి తన ఇంటి ముందు ఉన్న కొండను తొలగించి రహదారి వేయించాలని కోరాడు. ఏకంగా పదేళ్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదు. దీంతో విసుగెత్తి పోయిన శశి కొండను తానొక్కడినే తవ్వాలని నిర్ణయించుకుని, రోజుకు 6 గంటల చొప్పున కష్టపడి కొండను తవ్వేశాడు. అంతటితో ఆగకుండా సుమారు మూడేళ్లపాటు కష్టపడి తన ఇంటికి రహదారిని నిర్మించుకున్నాడు. ఆయన కథను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు అతడికి మూడు చక్రాల వాహనాన్ని కొనిచ్చారు.