: దూరం 1318 కిలోమీటర్లు... ప్రయాణ సమయం నాలుగు గంటలు.. చైనాలో వేగవంతమైన బుల్లెట్ రైలు!
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు వచ్చే నెల 21న చైనాలో ప్రారంభం కానుంది. బీజింగ్, షాంఘై నగరాల మధ్య ప్రయాణాన్ని మరో గంట తగ్గించేందుకు వీలుగా సగటున గంటకు 350 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచే రైళ్లను నడపనున్నారు. ఈ వివరాలను చైనా రైల్వే కార్పొరేషన్ ఈ రోజు వెల్లడించింది.
బీజింగ్-షాంఘై నగరాల మధ్య దూరం 1,318 కిలోమీటర్లు. దీంతో ఈ కొత్త రైలులో నాలుగు గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకునేందుకు వీలు కలగనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న రైళ్ల వేగం గంటకు సగటున 300 కిలోమీటర్లు. కొత్త రైళ్లు గంటకు 50 కిలోమీటర్లు అధిక వేగంతో నడుస్తాయి. అసాధారణ పరిస్థితులు, అత్యవసర పరిస్థితుల్లో ఈ రైళ్లు వాటంతట అవే వేగం తగ్గించుకుని ఆగిపోతాయి.