: శశికళకు షాక్.. పక్కా వీడియో ఆధారాన్ని సమర్పించిన డీఐజీ రూప!
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు ఊహించని షాక్ తగిలింది. జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు అధికారులకు 2 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించి వీవీఐపీ మర్యాదలు పొందుతున్నారని డీఐజీ రూప సీబీఐకి స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. ఇందులో జైలులోని ప్రధాన ద్వారం నుంచి శశికళ బయటకు వస్తున్న విజువల్స్ ఉండడం విశేషం.
దీనితో పాటు జైలులో శశికళ విలాసాలపై 14 పేజీల నివేదికను కూడా ఆమె అందజేశారు. సాధారణంగా జైలులోపలికి ఖైదీలు వెళ్లినా, జైలు నుంచి ఖైదీలు బయటకు వెళ్లినా ప్రధాన ద్వారానికి ఉండే చిన్న ద్వారం ద్వారానే రాకపోకలు జరుగుతాయి. సాధారణ సిబ్బంది కూడా ఇదే విధంగా లోపలికి వెళ్లి వస్తుంటారు. కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ప్రధాన ద్వారం తెరిచే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో శశికళకు సంబంధించిన పుటేజ్ ఈ వివాదంపై క్లారిటీ ఇస్తోంది. తాజాగా ఆమె సమర్పించిన ఆధారాలు, నివేదికతో శశికళకు జైలులో వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయని స్పష్టమవుతోంది