: చంద్రబాబు గారు ఎప్పుడూ నమ్మేది డబ్బునే!: వైసీపీ ఎంపీ మేకపాటి
చంద్రబాబు ఎప్పుడూ నమ్మేది డబ్బునేనని, చంద్రబాబు దగ్గర ఉన్నంత డబ్బు తమ వద్ద లేదని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్న చంద్రబాబు వద్ద డబ్బు పుష్కలంగా ఉందని, ఆయనతో తామెక్కడ పోటీ గలమని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నికల్లో చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ దురదృష్టమో, ప్రజల దురదృష్టమో తెలియదుగానీ, తమ పార్టీ ఓడిపోయిందని అన్నారు. నాటి ఎన్నికల అప్పుడు జగన్ సునామీలా విజృంభించాడని, అయితే, అతివిశ్వాసానికి పోవడం వల్ల తాము ఓడిపోయామని, చంద్రబాబు చక్కగా తన పని తాను చేసుకోపోయాడని అన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లకు కష్టపడేతత్త్వం బాగా ఉందని అన్నారు. అలాగే, చంద్రబాబునాయుడు కూడా కష్టపడతారు కానీ, వక్రమార్గంలో అని విమర్శించారు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలి? అనేదే చంద్రబాబుకు ఉంటుందని ఘాటు విమర్శలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాము డబ్బు పంచుతున్నామని కాంగ్రెస్ , టీడీపీ పార్టీ వాళ్లు చెప్పడంలో అర్థం లేదని అన్నారు. ఈ తరహా పనులను అసలు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ వాళ్లని, గతంలో తాను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడినే కనుక, వాళ్ల వ్యవహారాలన్నీ తనకు తెలుసని అన్నారు. ఈ ఉపఎన్నికను ఆపమని కాంగ్రెస్ పార్టీ కోరడం సమంజసం కాదని అన్నారు.