: 'మీరే ఇలా చేస్తే ఎలా'గంటూ కిరణ్ బేడీపై విమర్శల వెల్లువ!
రాత్రి పూట నడిరోడ్డుపై మహిళల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ చేసిన పని ఇప్పుడామెను కొత్త చిక్కుల్లో పడేసింది. రాత్రి సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై వీధుల్లో పర్యటించిన ఆమె, మహిళలకు తన రాష్ట్రం క్షేమకరమని ప్రకటించగా, ఆమె హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించి నిబంధనలను అతిక్రమించారని విమర్శలు వస్తున్నాయి.
వెనుక కూర్చున్న కిరణ్ బేడీ కానీ, వాహనాన్ని నడిపిన మహిళగానీ హెల్మెట్ ధరించకపోవడంతో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలపై జరిమానాలు విధిస్తారా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, మహిళల వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకే తాను హెల్మెట్ ధరించలేదని వివరణ ఇచ్చినప్పటికీ, ఈ విమర్శల వర్షం మాత్రం ఆగక పోవడం గమనార్హం.