: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన ఇజ్రాయెల్!
కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. కశ్మీర్ సమస్య భారత్-పాక్ అంతర్గత విషయమని, అందులో జోక్యం చేసుకోబోమని ఇజ్రాయెల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి నడుస్తామని పేర్కొన్నారు.
1990ల నుంచి ఇజ్రాయెల్‌తో భారత్‌కు దౌత్యపరమైన సంబంధాలు మెరుగయ్యాయి. ఇక ఇజ్రాయెల్ తొలి నుంచీ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నమ్ముతోంది. మరోవైపు ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించి చరిత్ర సృష్టించారు. దీంతో ఇజ్రాయెల్‌తో భారత్ బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ కశ్మీర్ అంశంపై స్పందించింది. ఈ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ వెనకే నడుస్తామని పేర్కొంది. గతనెలలో ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా మోదీ-నెతన్యాహు సమావేశంలోనూ ఇదే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.