: చెన్నై విజయమా.. ముంబయి మురిపెమా..!
పదకొండు మ్యాచ్ లు.. 9 విజయాలు.. 2 ఓటములు.. ఇదీ ఐపీఎల్-6లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో నెగ్గి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న సూపర్ కింగ్స్ మరో మ్యాచ్ కు సిద్ధమయ్యారు. అయితే, ఈసారి పటిష్టమైన ముంబయి ఇండియన్స్ తో తలపడనుండడంతో పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని క్రికెట్ పండితులంటున్నారు. హసీ, రైనా, ధోనీలు చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ ను దుర్భేద్యంగా మార్చగా.. అశ్విన్, బ్రావో బౌలింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక ఆల్ రౌండర్ పాత్రలో రవీంద్ర జడేజా అద్భుతంగా ఒదిగిపోయాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో 'నేనున్నా'నంటూ ఆదుకుంటున్నాడు.
మరోవైపు ముంబయి జట్టునూ తక్కువ అంచనా వేయలేం. తమదైన రోజున మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చివేయగల సమర్థులకు ఆ జట్టులో కొదవలేదు. ముఖ్యంగా కరీబియన్ స్టార్లు డ్వేన్ స్మిత్, కీరన్ పొలార్డ్ ఈ కోవకే చెందుతారు. వీటన్నింటిని మించి తన ఉనికితో జట్టులో స్ఫూర్తి నింపగల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఉండనే ఉన్నాడు. దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు, రోహిత్ శర్మ ఎంతటి ప్రమాదకర ఆటగాళ్ళో తెలియందికాదు.
బౌలింగ్ లో చెన్నై కంటే ముంబయి జట్టే బలంగా కనిపిస్తోంది. మలింగ, జాన్సన్, హర్భజన్, ఓజాలు బంతితో మ్యాచ్ ను తిప్పేయగల ప్రతిభావంతులే. నేటి సాయంత్రం 4 గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా నిలవనుంది. స్వంతమైదానంలో ఆడనుండడం ముంబయి ఇండియన్స్ జట్టుకు సానుకూలాంశం. కాగా, రాత్రి 8 గంటలకు జరిగే మరో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్.. పుణే వారియర్స్ తో తలపడనుంది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఈ పోరుకు వేదిక.
ఇదిలావుంటే, నిన్న రాత్రి హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై జయభేరి మోగించింది. సామీ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ రాణించడంతో సన్ రైజర్స్ గెలుపు నల్లేరుపై నడకే అయింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. హైదరాబాద్ బౌలర్ల దాటికి 80 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్-6లో ఇదే అత్యల్ప స్కోరు. ఇక లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. సామీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.