: ప్రతిష్ఠాత్మక పరుగు ప్రారంభం... లక్డీకపూల్ నుంచి గచ్చిబౌలి వరకూ ట్రాఫిక్ నిలిపివేత
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుండగా, దేశ విదేశాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. పరుగును హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించగా, మారథాన్ సాగే రహదారిని పోలీసులు మూసివేశారు. నక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్, రాజ్ భవన్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, సైబర్ టవర్స్, గచ్చిబౌలి, విప్రో సర్కిల్, హెచ్సీయూ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియం వరకూ పరుగు సాగనుంది.
పలు స్వచ్ఛంద సంస్థలు తమ తమ లక్ష్యాలను ప్రజలకు తెలిపేందుకు ఈ మారథాన్ ను వాడుకుంటున్నాయి. పలు రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలు ప్లకార్డులు ప్రదర్శిస్తుండగా, పరుగు వీరులకు వందలాది మంది రోడ్డుకిరువైపులా నిలబడి ఉత్తేజపరుస్తున్నారు. ఇందులో గెలుపొందే వారికి రూ. 7.2లక్షల వరకూ బహుమతులు అందిస్తుండటంతో కెన్యా, నైజీరియాకు చెందిన పలువురు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్ లుగా మూడు విభాగాల్లో పోటీ జరుగుతోంది.