: చంద్రబాబు నాయుడికి కళ్లు తలపై ఉన్నాయి: జగన్
రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ రోజు నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడికి కళ్లు తలపై ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు అధికారం, ధనం, మీడియా బలం ఉందని అహంకారం పెరిగిందని అన్నారు. చంద్రబాబు డబ్బులతో ఎమ్మెల్యేలను కొన్నారని, ప్రజలను కూడా కొనేస్తానని అనుకుంటున్నారని చెప్పారు. డబ్బులిచ్చి ఓటేయమని అడిగి దేవుడి ఫొటోపై ప్రమాణం చేయిస్తారని ఆరోపించారు.
అప్పుడు ఓటర్లు తమ మనసులో ధర్మం వైపే నిలబడతామని అనుకోవాలని జగన్ సూచించారు. దెయ్యాలు మాత్రమే చంద్రబాబు నాయుడిలా చేస్తాయని అన్నారు. మట్టి, ఇసుక, రాజధాని భూముల వరకు దేన్నీ చంద్రబాబు వదిలిపెట్టలేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎస్.మోహన్ రెడ్డి అనే ఇతర వ్యక్తులతో చంద్రబాబు నాయుడు నామినేషన్లు వేయించి వైసీపీకి వెళ్లే ఓట్లను వారికి పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నంద్యాల ఓటర్లు ఒక్క వ్యక్తిని ఎమ్మెల్యేగా చేయడానికి ఓటు వేయడం లేదని, మూడున్నరేళ్ల చంద్రబాబు అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.