: తన గ్రామంలో ఒక్క దోమనైనా పట్టిస్తే, రూ. లక్ష ఇస్తానంటున్న సర్పంచ్!
తాను చేసిన అభివృద్ధి మీద గట్టి నమ్మకంతో వున్నా ఆ గ్రామ సర్పంచ్ 'తన గ్రామంలో ఒక్క దోమనైనా పట్టిస్తే, రూ. లక్ష ఇస్తా'నని అంటున్నాడు. గుజరాత్‌లోని శబర్‌కంత జిల్లాలోని పున్సారీ గ్రామ సర్పంచ్ అయిన ఆయన పేరు హిమాంశు పటేల్. పట్టణాల్లో ఉండే సౌకర్యాలను గ్రామానికి తీసుకురావాలని తను చిన్న వయసులో కన్న కలను, గ్రామ సర్పంచ్‌గా ఎదిగి నిజం చేసుకున్నాడు. ప్రస్తుతం పున్సారీలో ఊరంతా సీసీ కెమెరాలు, వైఫై, బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ ప్లాంట్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్‌లతో పాటు ఒక స్మార్ట్‌సిటీలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
22 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికైన హిమాంశు పదవిలో చేరిన కొంతకాలానికి గ్రామస్తుల అవసరాల గురించి తెలుసుకున్నాడు. వారికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను మూడేళ్లలో సమకూర్చాడు. ఇందుకోసం హిమాంశు ఏ స్వచ్ఛంద సంస్థ సహాయం తీసుకోలేదు. కేవలం ప్రభుత్వ పథకాల ద్వారానే అనుకున్నది సాధించాడు. తర్వాత రోజుల్లో గ్రామాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశాడు. అందులో భాగంగా ఊరంతా స్పీకర్లు ఏర్పాటు చేసి గ్రామస్తులకు అందుబాటులో ఉండేవాడు.
అలాగే వైఫై, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాడు. పాల వ్యాపారం చేసే మహిళలకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాడు. తన అధీనంలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలను, ఆశా వర్కర్లను ప్రోత్సహించి వ్యాక్సిన్‌లు, ఆపరేషన్లు, డెలివరీలు సక్రమంగా జరిగేట్లు చూశాడు. ఎప్పటికైనా తన గ్రామాన్ని ప్రపంచంలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దాలనేది తన ఆశయమని హిమాంశు చెప్పాడు. అలాగే సౌకర్యాల కోసం పట్టణాలకు వలస పోకుండా, అక్కడి సౌకర్యాలను గ్రామాలకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని హిమాంశు పిలుపునిచ్చాడు.