: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే కుర్చీలో కుర్చున్నాను.. నా వన్డే కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది: విరాట్ కోహ్లీ ఆనందం
అది ఆగస్టు 18, 2008.. శ్రీలంకలో పర్యటిస్తోన్న టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో దంబుల్లా వేదికగా మొదటి వన్డే ఆడుతోంది. అదే రోజున విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో తన మొట్టమొదటి మ్యాచ్ ఆడాడు. క్రీజులోకి గంభీర్ తో పాటు విరాట్ కోహ్లీ వచ్చాడు. సరిగ్గా నేటికి తొమ్మిదేళ్లు అవుతుండడంతో ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీ ఇదే కుర్చీలో కూర్చున్నాడని, ఇప్పుడు కూడా మళ్లీ అదే కుర్చీలో కూర్చున్నాడని తెలిపింది. దానిపై కూర్చుండగా తీసిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. కొన్ని విషయాలు ఎప్పటికీ మారబోవని, లెజెండ్‌లు మాత్రం రాణిస్తూ ఎదుగుతారని చెప్పింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ శ్రీలంకలోని అదే దంబుల్లాలో ఉన్నాడని తెలిపింది. అప్పట్లో కూర్చున్న కుర్చీలోనే కోహ్లీ మళ్లీ కూర్చున్నాడని పేర్కొంది. అనంతరం ఇదే ఫొటోను కోహ్లీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే స్థలంలో తన వన్డే క్రికెట్ ప్రయాణం ప్రారంభమైందని చెప్పాడు.