: ఆ అవమానం తన ఖాతాలో పడకుండా పవన్ కల్యాణ్ తటస్థంగా ఉంటానని ప్రకటించారు: ఎమ్మెల్యే రోజా
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని పలువురు భావించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తటస్థంగా ఉంటానని ప్రకటించిన అంశంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ ఓటమి ఖాయమన్న విషయం పవన్‌కు అర్థమైందని, ఓడితే ఆ అవమానం తన ఖాతాలో పడకుండా పవన్ అటువంటి ప్రకటన చేశారని చురకలంటించారు. ఈ రోజు ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికను ఆపాలని చూస్తున్నారని రోజా ఆరోపించారు. రేపటి నుంచి నంద్యాలలో చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు ప్రారంభమవుతాయని వ్యాఖ్యానించారు. నంద్యాల ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి అసమర్థ పాలనను ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, ఆయనకు బుద్ధి చెప్పే అవకాశం నంద్యాల ప్రజలకు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. నంద్యాల ఓటర్ల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనాల్సిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం వైసీపీనే ఆదరిస్తారని ఆమె అన్నారు.