: జెండా వందనానికి గైర్హాజరైన 54 మంది ఐఏఎస్‌లకు నోటీసులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడానికి కారణాలు తెలియజేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 54 మంది ఐఏఎస్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ ఏర్పడిన నాటి నుంచి ఇలా గైర్హాజరైన ప్రభుత్వాధికారులకు నోటీసులు పంపడం ఇదే మొదటిసారి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ జెండా ఎగురవేసిన ప్రధాన వేడుకలో ప్రధాన కార్శదర్శుల కుర్చీలు ఖాళీగా ఉండటంతో గైర్హాజరైన వారందరికీ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి తనని వివరణ కోరినట్లు ప్రధాన కార్యదర్శి ఎస్ రామస్వామి చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల్లో గైర్హాజరైన ప్రభుత్వాధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించామని ఆయన ప్రకటించారు.