: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు సాక్షులా, నిందితులా అనేది ఇప్పుడే చెప్పలేం!: అకున్ సబర్వాల్
టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులు సాక్షులా, నిందితులా అనే విషయం చెప్పలేమని తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఈ విషయంలో తాము చట్టప్రకారం వ్యవహరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకు సిట్ 11 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసిందని వెల్లడించారు. ఈ కేసులో సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఈ కేసులో ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని అన్నారు.
నిందితుల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసుకున్నారని, ఆ నివేదికల కోసం ఎదురు చేస్తున్నామని అకున్ సబర్వాల్ చెప్పారు. సిట్ చేస్తోన్న దర్యాప్తునకు సర్కారు నుంచి పూర్తిగా మద్దతు ఉందని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో తాము విద్యార్థులు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే తలెత్తే నష్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.