: అమెరికన్ టెక్ దిగ్గజాలకు దీటుగా టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న చైనా కంపెనీలు!
టెక్నాలజీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాల సరసన చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్ కంపెనీలు చేరాయి. ఈ రెండు కంపెనీలు తమ దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా తమ సత్తా చాటుతున్నాయి. దీంతో ఇంటెల్, సిస్కో, ఐబీఎం వంటి కంపెనీల లాభాలను దాటేసి అమెరికన్ టెక్ కంపెనీలతో పోటీ పడుతున్నాయి. పాశ్చాత్య ప్రజల ఆన్‌లైన్ జీవితాలను అమెరికన్ కంపెనీలు ప్రభావితం చేస్తుండగా, అంతకంటే రెండు రెట్ల జనాభా ఉన్న చైనా ప్రజల ఆన్‌లైన్ జీవితాలను అలీబాబా ప్రభావితం చేస్తోంది.
మరో పక్క పాశ్చాత్య ప్రజల కంటే చైనీయులు ఆన్‌లైన్ షాపింగ్‌పై మక్కువ చూపించడంతో అలీబాబా లాభాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం చైనాలో ఇతర దేశాల ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండకపోవడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియా విభాగంలో టెన్సెంట్ కంపెనీ ఫేస్‌బుక్ సరసన చేరింది. ఫేస్‌బుక్‌కి ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల యూజర్లు ఉండగా, టెన్సెంట్‌కి ఒక్క చైనాలోనే దాదాపు రెండు బిలియన్ల యూజర్లు ఉన్నారు. త్వరలో వాట్సాప్ తరహాలో మెసేజింగ్ యాప్‌ను చైనాలో ప్రవేశపెట్టేందుకు టెన్సెంట్ రంగం సిద్ధం చేస్తోంది. టెక్నాలజీ రంగంలో అమెరికా కంపెనీలకు దీటుగా తయారై, త్వరలోనే వాటి మార్కును అందుకునేందుకు అలీబాబా, టెన్సెంట్‌లు చేస్తున్న ప్రయత్నాన్ని చైనా ప్రభుత్వం మెచ్చుకుంటోంది.