: ఓ చోట రూ. 2 వేలు, మరో చోట వెయ్యి... తక్కువ ఇస్తున్నారని పోలీసులకు విషయం చేరవేసిన నంద్యాల వాసులు!
ఓ వైపు అధికార టీడీపీ, మరోవైపు విపక్ష వైకాపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను కొనుగోలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాల పరిధిలోని గాంధీ నగర్, ఐలూరు ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని సమాచారం రావడంతో హుటాహుటిన వెళ్లిన పోలీసులు 22 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు.
కడపకు చెందిన 9 మంది, పులివెందులకు చెందిన ఆరుగురితో పాటు, నెల్లూరుకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరు ఏ పార్టీకి చెందిన వారన్న విషయమై విచారిస్తున్నారు. ఇక వీరి గురించిన సమాచారాన్ని కొందరు స్థానికులే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ ప్రాంతంలో ఓటుకు రూ. 2 వేలు ఇచ్చిన వీరు, మరో చోట తక్కువగా ఇస్తుండటంతో స్థానికులు కొంత వాగ్వాదానికి దిగి వారితో గొడవ పడ్డారని తెలుస్తోంది. ఆపై వారే పోలీసులకు విషయాన్ని చేరవేసినట్టు సమాచారం.