: ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని చితకబాదిన సీనియర్లు!
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలువిప్పింది. ఎల్బీనగర్ లింగజోడుకు చెందిన గిరిధర్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. కళాశాల నుంచి హైదరాబాదుకు కాలేజీ బస్సులో గిరిధర్ బయల్దేరాడు. అయితే అదే బస్సులో ఉన్న సమీర్, నరసింహా, నరసింహా గౌడ్ లు ర్యాగింగ్ చేశారు. ఈ మధ్య ట్రెండ్ గా మారిన బ్యాక్ బంప్స్ పేరుతో ర్యాగింగ్ చేశారు. ఉప్పల్ నుంచి ఈ ముగ్గురూ కలిసి ఎల్బీనగర్ వరకు చితక్కొట్టారు. కొట్టకుండా ఉండాలంటే 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ కి బస్సు చేరగానే వారి దెబ్బలు తాళలేక గిరిధర్ పోలీస్ స్టేషన్ లోపలికి పారిపోయాడు. దీంతో ముగ్గురు సీనియర్లు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.