: ‘జై బలయ్యా’ అన్న హీరోయిన్ కైరా దత్ ... అది కరెక్టు కాదని చెప్పిన నటుడు అలీ!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘పైసా వసూల్’ చిత్రం ఆడియో వేడుక ఈ రోజు ఖమ్మంలో జరగనుంది. అయితే, ఈ చిత్ర యూనిట్ అంతా ఖమ్మం వెళ్లడానికి రెడీ అయిన సమయంలో నటి చార్మి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ ఇచ్చింది. ఈ ఆడియో వేడుకకు వెళుతున్న వారందరినీ ఈ సందర్భంగా అలీతో కలిసి పరిచయం చేసింది. ఈ సందర్భంగా మొదట నటి శ్రియ, ఆ తర్వాత శ్రియ తల్లి, దర్శకులు క్రిష్, పూరీ జగన్నాథ్, పైసా వసూల్ చిత్ర నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడారు. ‘బాలయ్యతో చిత్రం నిర్మించారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? అని ఆనందప్రసాద్ ను అలీ ప్రశ్నించగా.. ‘మాటలు రావట్లేదు’ అనే సమాధానంతో పాటు ‘జై బాలయ్య’ అన్నారు.
ఆ తర్వాత ‘పైసా వసూల్’ హీరోయిన్ కైరాదత్ మాట్లాడుతూ, ‘హెలో ఎవ్రీవన్.. దిస్ ఈజ్ కైరా దత్... నెక్స్ట్ మీ ఈజ్ జై బలయ్య’ అని చెప్పింది. దీంతో, వెంటనే స్పందించిన అలీ.. ‘జై బలయ్య కాదు.. జై బాలయ్య’ అని అనడంతో ‘ఓకే’ అని కైరాదత్ చెప్పింది. ఆ తర్వాత హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, ఖమ్మంలో తన సినిమా ఆడియో వేడుక జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. తన ఫ్యాన్స్ ఖమ్మంలో కూడా ఉన్నారు కనుక, ఆడియో వేడుక అక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ, ‘పైసా వసూల్’ విజయవంతం కావాలని కోరారు.