: ఇక అల్టిమేటం జారీ చేస్తాం.. చర్యలు తీసుకుంటాం.. జాగ్రత్త: భారత్‌ను తీవ్రంగా హెచ్చరించిన చైనా
చైనా, భారత్ మధ్య సుమారు రెండు నెలలుగా డోక్లాం విషయమై నెలకొన్న ఉద్రిక్తతలపై ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ మరోసారి రెచ్చగొట్టే విధంగా ఓ కథనాన్ని ప్రచురించింది. భారత సైనికులు డోక్లాం నుంచి వెనక్కి వెళ్లకపోతే త్వరలోనే తాము అల్టిమేటం జారీ చేస్తామని, చర్యలు తీసుకుంటామని తమ దేశ నేవీ మాజీ అధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొంది. డోక్లాంను తమ భూభాగంగా పేర్కొన్న ఆ పత్రిక తమ ప్రాంతం నుండి భారత సైనికులు వెనక్కి వెళ్లడమే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుందని తెలిపింది.
వచ్చేనెల ప్రారంభంలోనే అల్టిమేటం జారీ చేస్తామని, ఒకవేళ భారత్ దాన్ని కూడా తిరస్కరిస్తే, భారత సైన్యాన్ని డోక్లాం నుంచి వెళ్లగొట్టడానికి తమకు అనేక మార్గాలు ఉన్నాయని అందులో రాసుకొచ్చింది. డోక్లాం విషయం నేపథ్యంలో బ్రిక్స్ సమితి ఆశయాలు దెబ్బతినకూడదని, ఆ ఐదు దేశాల ఆర్థిక పురోగతికి ఈ అంశం అడ్డుకాకూడదని నీతులు చెప్పుకొచ్చింది. సైనిక పరంగా భారత్ కన్నా చైనా ఎంతో బలంగా ఉందని, తమ వద్ద ఎంతో శక్తిమంతమైన కొత్త ఆయుధాలు, ఎయిర్ బేసెస్ ఉన్నాయని పేర్కొంది.