: విషపు నురగలు కక్కుతున్న బెంగళూరు సరస్సులు!
గార్డెన్ సిటీ, గ్రీన్ సిటీగా పేరు గాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో సరస్సులు విష రసాయనాలతో కూడిన నురగలు కక్కుతున్నాయి. ఈ నురగలు దగ్గరలోని ఇళ్ల మధ్య లోకి, రోడ్లపైకి వచ్చి పడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడి వార్తేర్, బెల్లందూర్ సరస్సులకు పుష్కలంగా నీరు వచ్చి చేరింది. అయితే, సమీపంలో ఉండే కంపెనీల నుంచి వచ్చే వ్యర్థపదార్థాలు, రసాయనాలు ఈ సరస్సులలో కలుస్తుండటంతో అందులోని నీరు విషతుల్యంగా మారడం, తద్వారా విష పూరిత నురగ ఏర్పడటం జరుగుతోంది.
కాగా, 1890 తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో అధిక వర్షపాతం నమోదైంది. గతంలో బెల్లందూర్ సరస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన జరిగింది. సరస్సులో రసాయనాలు ఉండటంతోనే మంటలు చెలరేగుతున్నట్టు నాడు తెలిసింది. కాగా, ఈ విషయమై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, సరస్సుల నుంచి విషపూరిత నురగ రాకుండా చేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని, మరో రెండేళ్లలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు.