: సిజేరియన్ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చిన పదేళ్ల అత్యాచార బాధితురాలు
చండీఘడ్‌లో అత్యాచారానికి గురైన పదేళ్ల బాలిక ప్రాణానికి ప్రమాదముండటంతో అబార్షన్‌కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పదేళ్ల బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు చండీఘడ్ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు తెలిపారు. సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీశామని, ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వారు చెప్పారు. కొన్ని నెలల పాటు తమ దగ్గరి బంధువు అత్యాచారం చేయడంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది.
కడుపు నొప్పి వస్తోందని బాలిక తల్లిదండ్రులు డాక్టర్ల వద్దకు వచ్చిన తర్వాతే ఆ బాలిక అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. దీంతో అబార్షన్ అనుమతి కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే డాక్టర్ల సలహా మేరకు అబార్షన్ చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదం అని గ్రహించి వారి విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. డాక్టర్ దాసరి హరీశ్ నేతృత్వంలో బాలికకు చికిత్స అందించాలని ఆదేశించింది. బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆ మైనర్ బాలికకు తెలియదని డాక్టర్లు చెప్పారు.