: ఎంత దారుణం...డబ్బు కోసం కన్న కూతుర్ని వ్యభిచారిని చేసిన తల్లి!
కరెన్సీ మోజు పేగు బంధాన్ని కూడా లెక్కచేయకుండా వ్యభిచార కేంద్రానికి విక్రయించింది. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక గూడూరులో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం వెలటూరు ప్రాంతానికి చెందిన గొట్టం మణి (35) ఆశావర్కర్ గా పని చేసేది. ఆమెకు చిన్నప్పతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. వివాదం నేపథ్యంలో మణి, చిన్నప్ప విడిపోయారు. దీంతో కుమార్తెతో కలిసి పాయకాపురంలోని ఉడా కాలనీలో నివాసం ఉండేది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ (43)తో సహజీవనం చేయడం ప్రారంభించింది.
అయితే, తమ సహజీవనానికి అడ్డుగా ఉందని భావించి, పైగా డబ్బు కూడా వస్తుందన్న ఆశతో ఏడవ తరగతి చదువుతున్న తన కూతుర్ని (14) నాలుగు నెలల కిందట వ్యభిచార వృత్తి కోసం శ్రీకాళహస్తిలోని ఒక వ్యభిచార కేంద్రానికి విక్రయించింది. జూన్ 5న వ్యభిచార కేంద్రం నుంచి తప్పించుకున్న బాలిక ఆ నరకం నుంచి బయటపడి ట్రైన్ ఎక్కి గూడూరు చేరింది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఏమీ తెలియనట్లుగా తన కూతురు కనిపించడం లేదంటూ జూన్ 14వ తేదీన నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అనంతరం తన నివాసాన్ని ఉడా కాలనీ నుంచి న్యూ రాజరాజేశ్వరిపేటకు మార్చింది. మరోపక్క, గూడూరు చేరుకున్న బాలిక రైల్వేస్టేషన్ లో దిక్కుతోచని స్థితిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో ట్యాక్సీ డ్రైవర్ లీలాకృష్ణ ఆమెను ప్రశ్నించడంతో, జరిగినదంతా అతనికి వివరించింది. అయితే పోలీసులకు సమాచారం అందించాల్సిన లీలాకృష్ణ అలా చేయకుండా ఆమెను తన వెంట తీసుకెళ్లిపోయాడు. తరువాత పెళ్లి చేసుకున్నాడు. బాలిక అదృశ్యంపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు గూడూరులో ఉన్నట్టు గుర్తించారు. దీంతో వ్యభిచారం రొంపిలోకి దింపిన తల్లి మణి, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న మల్లికార్జున్, బాలికను పెళ్లి చేసుకున్న లీలాకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. తల్లి, ఆమె ప్రియుడిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేయగా, లీలాకృష్ణపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు.