: 150 మంది మహిళా కానిస్టేబుళ్లకు బైక్ లు!
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కమిషనరేట్స్ పరిధిలో పని చేస్తున్న 150 మంది మహిళా కానిస్టేబుళ్లకు మోటార్ బైక్స్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాదులోని హోటల్ మారియట్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ బైక్స్ అందజేస్తారు. శాంతిభద్రతల నిర్వహణ, మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్ లు, కేసుల పరిశోధనల్లో మహిళా కానిస్టేబుల్స్ ను కూడా భాగస్వాములను చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు బైక్ లు అందజేయనున్నారు. హైదరాబాదు కమిషనరేట్ పరిధిలోని 70 మంది మహిళా కానిస్టేబుల్స్ కు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 50 మంది మహిళా కానిస్టేబుళ్లకు, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 30 మంది మహిళా కానిస్టేబుళ్లకు బైక్ లను అందజేయనున్నారు.