: పాపం.. బాలకృష్ణ అమాయకుడు.. రాసిచ్చిందే చదివారు!: ఎమ్మెల్యే రోజా
తనకు మీడియా లేదని జగన్ అసత్య ప్రసారం చేసుకుంటున్నారని, అటువంటప్పుడు అసలు సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ ఎవరివో చెప్పాలని నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాలకృష్ణ అమాయకుడని, చంద్రబాబునాయుడు రాసిచ్చిందే ఆయన చదివారని అన్నారు. పెద్దకొట్టాలలో నిర్వహించిన రోడ్ షో లో రోజా, ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ,‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి నిరుద్యోగికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాడు చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే, ఒక్కో నిరుద్యోగికి ఇప్పటికే రూ.78 వేలు బాకీ పడి ఉన్నాడు చంద్రబాబునాయడు.
ఫైవ్ స్టార్ హోటల్ లో కుటుంబాన్ని పెట్టి కోట్లాది రూపాయలు కట్టడానికి, హైదరాబాద్ లో ఒక ఇల్లు , విజయవాడలో మరో ఇల్లు, ఇంకోటేదో దిక్కుమాలిన ఇల్లు కట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. పేదవాడికి ఏదైనా చెయ్యాలంటే మాత్రం ఖజనా ఖాళీగా ఉందంటారు. అప్పుడు మాత్రం, బీద ఏడుపులు చంద్రబాబు బాగా ఏడుస్తాడు. దీనిని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి.. ప్రజలను ప్రేమించే వ్యక్తి వైఎస్సార్ అయితే, ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ప్రజలను ప్రేమించే వ్యక్తి చంద్రబాబాబు నాయుడు. ఆ ఎలక్షన్ల అప్పుడు మాత్రం ప్రజలకు ఏం కావాలన్న ఇస్తానంటాడు. అడిగిందీ ఇస్తానంటాడు..అడగనిదీ ఇస్తానంటాడు. గెలిచి అధికారంలోకి వచ్చాక ‘మీరు ఎవరు?’ అంటాడు. మన ఊళ్లో చెప్పుకుంటాం.. ‘ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న’ అని!’ రోజా ఎద్దేవా చేశారు.