: చైనా దృష్టిలో 'పరిమిత సైనిక చర్య' అంటే రాళ్లదాడన్నమాట!


తమ భూభాగంలోకి భారత సైనికులు చొరబడ్డారని ఆరోపిస్తూ, వారిపై పరిమిత సైనిక చర్య చేపట్టేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగి మూడు రోజులైంది. ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిందే చాలన్నట్టుగా, సరిహద్దుల్లో చైనా జవాన్లు తమ తుపాకులను పక్కనబెట్టి, రాళ్లను చేతబట్టారు. డోక్లామ్ లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్న వేళ, లడక్ లో చొరబాటుకు ప్రయత్నించి, భారత సైనికులపై రాళ్ల దాడికి దిగారు. భారత భూభాగంలోకి చొరబడి మన జవాన్లపై రాళ్ల వర్షం కురిపించి, పలువురిని గాయపరిచారు. చైనా సైనికులను ప్రతిఘటించేందుకు భారత జవాన్లు సైతం రాళ్లను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతానికి ఈ దాడి రాళ్ల వరకే పరిమితమైనా, భవిష్యత్తులో తుపాకుల వరకూ కూడా వెళుతుందేమోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. భారత్ పై ఒత్తిడిని పెంచాలన్న ఉద్దేశంతోనే, డోక్లామ్ లో సైన్యాన్ని కొనసాగిస్తూనే, లడక్ ప్రాంతంలో చొరబాటు యత్నాలను చైనా ప్రారంభించిందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో లడక్ లో చైనా, భారత సైనికుల మధ్య ఇటువంటి దాడులు జరగడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News