: జగన్ నన్ను చంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.. నాకేం జరిగినా జగన్ దే బాధ్యత: మంత్రి ఆదినారాయణ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని... జగన్ మనుషులు తనను చంపేందుకు తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బాబాయ్ వివేకానందరెడ్డిని ఓడించానని... అందుకే తనపై జగన్ కక్ష పెంచుకున్నారని చెప్పారు. చంపించడం జగన్ కుటుంబ సంస్కృతి అని అన్నారు. తనకు ఏదైనా జరిగితే దానికి జగనే బాధ్యత వహించాలని తెలిపారు.
వైసీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. దళితులు శుభ్రంగా ఉండాలని, లేకపోతే జబ్బులు వస్తాయని మాత్రమే వారికి తాను సూచించారని... దీనిపై వైసీపీ నేతలు లేనిపోని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దళితవాడకు దగ్గర్లోనే నివాసం ఉంటున్నానని... తన చుట్టూ ఉండేవారంతా దళితులేనని చెప్పారు. నంద్యాల ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని... ఉప ఎన్నిక తర్వాత జగన్ పార్టీ గల్లంతవుతుందని అన్నారు.