: 70 ఏళ్లలో పరిస్థితులు ఎంతెలా మారిపోయాయో!.. ఈ విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!


గడిచిన కాలం ఎంతో మధురం.. అని చాలామంది పాటలు పాడుకుంటూ అప్పటి ఆనందాన్ని నెమరువేసుకుంటుంటారు. ఆ.. రోజులే వేరు.. అని పెద్దలు చెప్పగా కూడా వింటుంటాం. అయితే ఒకప్పటి పరిస్థితులతో బేరీజు వేసుకుంటే మాత్రం ఒకింత ఆశ్చర్యపోక తప్పదు. ‘రోజులు ఎంతెలా మారిపోయాయి’ అని అనుకోకుండా ఉండలేం కూడా. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే..  

70 ఏళ్ల క్రితం భరతమాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించాయి. నేటి యువత ఘనంగా సంబరాలు చేసుకుంటోంది. అయితే ఆనాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన వారు కొందరే ఉన్నారు. అయితే నాటి పత్రికల క్లిప్లింగ్‌లు మాత్రం అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.

ఆగస్టు 15, 1947న ‘హిందూస్థాన్ టైమ్స్’ మొదటి పేజీలో ప్రధానంగా భారత్‌కు స్వాతంత్ర్యం రావడాన్ని ప్రచురించింది. అదే పత్రిక ఆరో పేజీలో కుడివైపు కిందన బెంగళూరు గవర్నమెంట్ సోప్ ఫ్యాక్టరీ ప్రకటన ఉంది. అందులో లేవెండర్ సబ్బుకు 9 అణాల (ఇంచుమించు 56 పైసలు)కు మించి చెల్లించవద్దని వినియోగదారులను కోరింది. కొందరు వ్యాపారులు అసలు ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, కాబట్టి 9 అణాల కంటే ఎక్కువ చెల్లించవద్దని పేర్కొంది. ఇప్పుడా సబ్బు ఖరీదు ఏకంగా 60 రెట్లు పెరిగింది.
 
ఇక దేశ స్వాతంత్ర్య సంబరాల్లో పాలుపంచుకునేందుకు వెళ్లే వారి కోసం ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ముంబై-ఢిల్లీ విమాన టికెట్‌ను రూ.140కే ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పడా టికెట్ ధర రూ.6 వేలు. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అప్పట్లో పది గ్రాముల బంగారం ధర రూ.88.62 కాగా ముంబై-ఢిల్లీ విమాన టికెట్ ధర రూ.140 కావడం గమనార్హం. అంటే బంగారం కంటే ఫ్లైట్ టికెటే ఖరీదన్నమాట. అదే రోజు పెట్రోలు లీటర్ 30 పైసలు. నేడు రూ.67.50. క్విట్ ఇండియా సమయంలో పది గ్రాముల బంగారం ధర రూ.44 ఇప్పుడు 300 రెట్లు పెరిగి దాదాపు రూ.30 వేలకు చేరుకుంది. అలాగే న్యూస్ పేపర్ ధర 0.13  పైసలు, సినిమా టికెట్ ధర రూ.30 పైసలు, పాలు లీటరుకు రూ.12  పైసలు, రెయిన్ కోట్ రూ.4.
ఇప్పుడు చెప్పండి.. గడిచిన కాలమే హాయి కదూ!

  • Loading...

More Telugu News