: సినిమా ఛాన్స్ పేరిట రెండు సార్లు అత్యాచారం చేయబోయారు...తప్పించుకున్నాను!: పోలీసులను ఆశ్రయించిన యువతి
సినిమా ఛాన్స్ పేరుతో రెండు సార్లు అత్యాచారయత్నం చేయగా తప్పించుకుని వచ్చానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... విజయవాడలోని పటమటకు చెందిన యువతికి సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తామని చెప్పి, భీమవరంలో షూటింగ్ ఉందని ఆమెను కారులో ఎక్కించుకుని దర్శకుడు చలపతి, హీరో సృజన్ తీసుకెళ్లారు. అయితే కారులో వెళ్తున్న సమయంలోనే ఆమెపై అత్యాచారయత్నం చేయగా, వారిని ప్రతిఘటించడంతో నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైందని బాధితురాలు తెలిపింది.
గాయాలపాలైన తాము చికిత్స తీసుకుని మరో కారులో షూటింగ్ స్పాట్ కు బయల్దేరగా దారిలో మరోసారి తనపై వారు అత్యాచారయత్నం చేసినట్టు బాధితురాలు తెలిపింది. దీంతో వారి నుంచి అతి కష్టం మీద తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు చలపతి, హీరో సృజన్ ను అదుపులోకి తీసుకున్నారు.