: బాలుడి చేతిలో మృత్యువు ఓడిపోయింది.. ఫలించిన 11 గంటల ఆపరేషన్.. బోరుబావి నుంచి చంద్రశేఖర్ ను సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీమ్!


గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం బాలుడిని సురక్షితంగా బయటకు తీసింది. దాదాపు 11 గంటలపాటు ఆపరేషన్ కొనసాగింది. సజీవంగా బయటకు వచ్చిన బాలుడిని చూసిన తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తొలుత బాలుడిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చివరికి బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతున మరో గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు.

గ్రామానికి చెందిన అనూష, మల్లికార్జున కుమారుడైన చంద్రశేఖర్ పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. లోపలున్న బాలుడికి నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. మరోవైపు బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. మధ్యలో సున్నపురాయి తగలడంతో సహాయక చర్యలకు కొంత ఆలస్యం అయింది. రాత్రి 10 గంటల సమయంలో వర్షం మరోమారు ఆటంకం కలిగించింది. అయినా సహాయక చర్యలు ఆపలేదు. చివరికి తెల్లవారుజామున 2:40 గంటలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.
 

  • Loading...

More Telugu News