: పాకిస్తాన్ పై పంజా విసిరిన భారత హ్యాకర్లు...500 వెబ్ సైట్లు హ్యాక్?


పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 14) సందర్భంగా భారత హ్యాకర్లు ఆ దేశానికి చుక్కలు చూపించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాక్ కు చెందిన సుమారు 500 వెబ్‌ సైట్లను హ్యాక్ చేశారు. అందులో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి చెందిన పలు ప్రధాన వెబ్‌ సైట్లు కూడా ఉండడం విశేషం. హ్యాక్ చేసిన వెబ్‌ సైట్లలో భారత్‌ ను కీర్తిస్తూ పోస్టులు పెట్టారు. పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ, పర్యావరణ శాఖ, ఇంటర్-ప్రొవిన్షియల్ సహకార శాఖ, జలవనరులు- విద్యుత్ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి పలు మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్ సైట్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు.

కొన్ని వెబ్ సైట్లను వేగంగా పునరుధ్ధరించగా, ఇంకా పునరుద్ధరణ జరగని సైట్లలో ‘‘వెబ్‌ సైట్ అండర్ మెయింటెనెన్స్‌...విల్ బి బ్యాక్ సూన్...సారీ ఫర్ ది ఇన్ కన్వీనియెన్స్’’ అంటూ సందేశాలు కనిపిస్తున్నాయి. కాగా, ‘‘లూలూసెక్ ఇండియా’’ అని పిలుచుకుంటున్న ఓ హ్యాకర్ల బృందం ఈ నిర్వాకానికి పాల్పడినట్టు పాకిస్తాన్ ఐటీ శాఖ అధికారి వెల్లడించారు. కాగా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య కాలంలో భారత వైబ్ సైట్లపై దాడి చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నించడం...ఆ వెంటనే భారత హ్యాకర్లు ప్రతీకార చర్యలకు దిగడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. 

  • Loading...

More Telugu News