: వేడెక్కిన నంద్యాల.. రేపు బాలయ్య, ఆ తర్వాత బాబు ప్రచారం.. అక్కడే తిష్టవేసిన జగన్!
రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నంద్యాల రాజకీయం వేడెక్కుతోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీలు రెండూ ఉప ఎన్నిక గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయం రంజుగా మారుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రగులుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికార పక్షంపై పైచేయి సాధించాలని వైసీపీ చీఫ్ జగన్ భావిస్తుండగా, నంద్యాలను దక్కించుకోవడం ద్వారా వైసీపీ ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీయాలని టీడీపీ భావిస్తోంది. నంద్యాల సీటును గెలుచుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీని మానసికంగా దెబ్బకొట్టాలని నిర్ణయించింది. ఫలితంగా ప్రచారంలో ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్నాయి.
నంద్యాల సీటుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిన టీడీపీ ప్రచారంలో జనాకర్షక నాయకులను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను బరిలోకి దింపనుంది. ఈ క్రమంలో రేపు (బుధవారం) ఆయన నంద్యాలలో ప్రచారం చేయనున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక రోజు ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఇన్‌చార్జీ నేతలు మండలాలు, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా నంద్యాలలోనే తిష్టవేశారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు నంద్యాలపై దృష్టి కేంద్రీకరించారు. విస్తృతంగా పర్యటిస్తూ ప్రసంగాలు తగ్గించి ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు గోస్పాడు మండలంపై వైసీపీ, టీడీపీలు ప్రధానంగా దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో ఈ మండలంలో వైసీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో అది తమకు అనుకూలమని వైసీపీ భావిస్తోంది. అయితే ఈసారి ఆ మండలంలో పైచేయి సాధించాలని భావిస్తున్న టీడీపీ నేతలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.