: జమ్ముకశ్మీర్‌లో మా ఫ్యాక్టరీ నెలకొల్పి.. అక్కడి యువతకు ఉద్యోగాలు ఇస్తాం!: రాందేవ్ బాబా
జమ్ముకశ్మీర్‌లో తమ పతంజలి ఉత్పత్తుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పుతామని, అందుకోసం అక్కడ భూమిని సేకరించే పనిలో ఉన్నామని యోగా గురు రాందేవ్ బాబా తెలిపారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా అక్కడి యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నామని అన్నారు. ఉగ్రవాదం గురించి ఆయన మాట్లాడుతూ... యోగా సాధన చేస్తున్నవారు భవిష్యత్తులో ఉగ్రవాదులుగా మారబోరని అన్నారు. యోగా సాధన చేసిన వారు ఉగ్రవాదులుగా మారినట్లు చరిత్రలో లేదని అన్నారు. కశ్మీర్‌లో చెలరేగుతున్న అల్లర్ల గురించి ఆయన స్పందిస్తూ... అన్ని మతాలలో ఉండే మంచి విషయాలను గురించి చిన్నారులు నేర్చుకోవాలని, అప్పుడే మతసామరస్యం వెల్లివిరుస్తుందని, శాంతి ఏర్పడుతుందని అన్నారు.
ఉద్రిక్తతలను పెంచే మనిషి ఆలోచనల తీరుకు యోగా ఒక మంచి చికిత్సలా పనిచేసి కశ్మీర్ వ్యాలీలో యువతను మారుస్తుందని తాను నమ్ముతున్నానని రాందేవ్ బాబా అన్నారు. కశ్మీర్‌లో పతంజలి ఫ్యాక్టరీని నెలకొల్పడానికి మొత్తం 150 ఎకరాల భూమి కోసం చూస్తున్నామని అన్నారు.