: కార్తీ చిదంబరం విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అవినీతికి పాల్పడిన కేసుల్లో సీబీఐ జారీ చేసిన `లుకౌట్` నోటీసుపై మద్రాసు హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై తీర్పును కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్రాసు హైకోర్టు స్టే విధించడం వల్ల విచారణల్లో అవకతవకలు ఏర్పడవచ్చని, కార్తీ చిదంబరం దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉందని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.
అవినీతి కేసుల విషయంలో సీబీఐ ఇప్పటికి రెండు సార్లు కార్తీ చిదంబరానికి నోటీసులు జారీ చేసింది. మొదటి నోటీసు జారీ చేసినపుడు తాను విదేశాల్లో ఉన్నట్లు కార్తీ చెప్పుకొచ్చాడు. ఇక రెండో నోటీసుకు కూడా కార్తీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో సీబీఐ కార్తీని దేశం వదిలి వెళ్లకుండా చేసేందుకు అన్ని విమానాశ్రయాలకు కార్తీని ప్రయాణం చేయకుండా అడ్డుకోమని ఆదేశాలు జారీ చేస్తూ అతనిపై లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై స్టే కోరుతూ కార్తీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. మద్రాసు హైకోర్టు కార్తీకి అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఇలా ఏదో ఒకవిధంగా విచారణను వాయిదా వేయడానికి కార్తీ ప్రయత్నిస్తున్నట్లు సీబీఐ తెలిపింది.